ఛానళ్ల విభజన విషయంలో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు రెండు ఛానళ్లు అవసరమేనంటూ ఈటీవీ వంటి ఛానళ్లలో విభజన ప్రారంభమైంది. దీంతో అన్ని ఛానళ్లు ఇదే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు కానీ...దిగితే కాని లోతు తెలియదు అన్నట్లు...ఇప్పుడు యాజమాన్యాలకు సరికొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. చంద్రబాబు మూడు రోజులు సీమాంధ్రలోనే ఉండి పరిపాలన చేస్తానని ప్రకటించడంతో హడావుడి పడ్డ ఛానళ్లు ఆయన మాట నీటి మీద రాతలా మారడంతో కొద్దిగా ఊపిరిపీల్చుకున్నాయి. కానీ ఎప్పటికైనా విజయవాడ కేంద్రంగా చానళ్లనైతే ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎదురవుతోంది. దీంతో ఛానల్ పర్మిషన్ల విషయంలో చాలా యాజమాన్యాలు ఇబ్బందులు పడుతుండగా...ఇప్పటికిప్పుడు మళ్లీ అదనపు ఖర్చు పెట్టి అక్కడో సెటప్ పెట్టాలంటే ఎలా అంటూ ఆర్ధికంగా ఆలోచిస్తున్న వారూ ఉన్నారు. పుట్టగొడుగుల్లా తెలుగు మీడియాలో ఛానళ్ల రాక తీసుకొచ్చిన సమస్యగా కూడా మారింది. ఒకరు సీమాంధ్రకు ఛానల్ ఏర్పాటు చేస్తే ఇక మిగతా వారంతా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎదురవుతోంది. ఈ దిశగా ఆంధ్రజ్యోతి కూడా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ స్థలాలను కూడా సేకరించినట్లు సమాచారం. ఆర్ధికంగా లాభాల్లో లేకపోయినా...ఇప్పుడు తప్పనిసరిగా విజయవాడ కేంద్రంగా కొత్త నెట్ వర్క్ కూడా స్టార్ట్ చేయాల్సి వస్తోంది. బ్యూరో, పార్టీ బీట్స్, క్రైం ఇలా సీనియర్ జర్నలిస్టుల అవసరం కూడా పెరిగింది. పెద్ద చానళ్లలో సీనియర్స్ కి కొదవ లేకపోయినా తక్కువ జీతాలిచ్చే ఛానళ్లు మాత్రం జర్నలిస్టుల కొరతను కూడా ఎదుర్కొనాల్సిన దుస్థితి. మొత్తం మీద రాష్ట్ర విభజన ఛానళ్లపై ఆర్ధికంగా పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.
